మాయాబజార్ చిత్ర సమీక్ష ఘనవిజయం!!

ఈ నెల తెలుగువాహిని సమావేశంలో వినూత్నంగా జరిగిన తొలి తెలుగు చిత్ర సమీక్ష మాయాబజార్ ఘనవిజయం సాధించినదన్న విషయం ఆ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం లోని సాహిత్య, సంగీత, చిత్ర నిర్మాణ నైపుణ్యాల గురించి విక్రమ్, అశ్విన్ లు నభూతో, నభవిష్యత్ అన్నట్లుగా ప్రసంగించి సభ్యుల కరతాళ ధ్వనులను పదే పదే అందుకొన్నారు. ఈ చిత్ర నిర్మాణము, దాని సాంకేతిక విలువలు, వాటి వెనుక వున్న ప్రతి ఒక్కరి కృషి గురించి పేరు పేరునా ముచ్చటించి మనకు తెలియని ఎన్నో ఆసక్తి కరమైన విషాయలను తెలియజేసారు. "మాయాబజార్ సినిమా బావుంటుంది" అనేసి సరిపెట్టుకొనే వారికి అది ఎందుకు అంత బావుంటుందో ఇప్పుడు సుస్పష్టంగా తెలిసి వచ్చింది. మాయాబజార్ సినిమాను ఒక దృశ్య కావ్యంగా మనకు సమర్పించడం వెనుక విక్రమ్, అశ్విన్ లు రెండు నెలలుగా చేసిన విస్తృత పరిశోధన, కృషి చక్కటి ఫలితాన్నిచ్చింది. వీరికి మరోసారి మన లిఖిత పూర్వక అభినందనలు.

సాహిత్య విలువలున్న తెలుగు చలన చిత్రాలను సమీక్షించడం అనే ప్రక్రియను తెలుగువాహినిలో ప్రవేశ పెట్టడమే కాకుండా, దానికి పూర్తి దర్శకత్వ బాధ్యతలు వహించి, మన విక్రమ్, అశ్విన్ లతో నాలుగు సార్లు రిహార్సల్సు చేయించిన మురళి గారికి ధన్యవాదములు.

ఈ సమీక్షకు కావలసిని సాంకేతిక సహకారం (స్లయిడ్సూ, వీడియో క్లిప్పింగ్సూ, సీడీ ల తయారీ), చిత్రం లోని పద్యాల నడక, గణ విభజన లాంటివి సమకూర్చడంతో పాటు, సమావేశము జరిగిన హాలులో బొమ్మల కొలువు, ముగ్గులు, గొబ్బిమ్మలు పెట్టి సంక్రాంతి పండగ శోభను ప్రతిభింబించిన స్మితకు అభినందనలు.

మురళి గారితో పాటు అన్ని రిహర్సులకు హాజారై, అన్ని విషయాలను సునిశితంగా గమనించి, తగిని సూచినలు అందజేస్తూ విక్రమ్, అశ్విన్ లను వెన్ను తట్టి ప్రోత్సహించిన భాస్కర్ గారికి కూడా అభినందనలు.

ఈ సమావేశపు కార్యక్రమ నిర్వహణలో తమవంతు సహకారాన్నందించిన మరెందరో సభ్యలకు, ప్రతినెలా మనకు కమ్మని 'వింధైన వంటకంబు' లను అందిస్తున్న మన మహిళా సభ్యలకు కృతజ్ఞతలు.

ఈ సమావేశంలో తీసిన వీడియోలు, ఫొటోలు, ఆడియో రికార్డింగులు త్వరలో తెలుగువాహిని వెబ్ సైట్ లో పెట్టగలము. ప్రస్తుతానికి కొన్ని ఫోటోలను ఇక్కడ వీక్షించ గలరు.

http://picasaweb.google.com/trivikram.singaraju/SankranthiTeluguVaahini